బతుకమ్మ మీద ఇప్పుడు చాలా పాటలే వినిపిస్తున్నాయి. వాటిలో అనాదిగా జానపదులు పాడుకుంటున్న పాటలలో ఒకటి ఇది. హద్యంగా, లయబద్ధంగా బతుకమ్మ కథని పాటరూపంలో పాడుతూ బతుకమ్మ చుట్టూ ఆడిస్తుందీ పాట. దాదాపు 60 ఏళ్ల క్రితమే కృష్ణశ్రీ అనే రచయిత ఈ పాటని సేకరించి తన ‘పల్లెపదాలు’ పుస్తకంలో ప్రచురించారు.
శ్రీలక్ష్మి దేవియు చందమామ – సృష్టి బతుకమ్మయ్యె చందమామ
పుట్టినా రీతిచెప్పె చందమామ – భట్టు నరసింహ కవి చందమామ
ధరచోళ దేశమున చందమామ – ధర్మాంగుడను రాజు చందమామ
ఆరాజు భార్యయు చందమామ – అతి సత్యవతి యండ్రు చందమామ
నూరునోములు నోమి చందమామ – నూరుమందిని గాంచె చందమామ
వారు శూరులయ్యు చందమామ – వైరులచే హతమైరి చందమామ
తల్లిదండ్రులపుడు చందమామ – తరగనీ శోకమున చందమామ
ధనరాజ్యముల బాసి చందమామ – దాయాదులను బాసి చందమామ
వనితతో ఆ రాజు చందమామ – వనమందు నివసించె చందమామ
కలికి లక్ష్మిని గూర్చి చందమామ – ఘనతపం బొనరించె చందమామ
ప్రత్యక్షమై లక్ష్మి చందమామ – పలికె వరమడుగుమని చందమామ
వినుతించి వేడుచూ చందమామ – వెలది తనగర్భమున చందమామ
పుట్టుమని వేడగా చందమామ – పూబోణి మది మెచ్చి చందమామ
సత్యవతి గర్భమున చందమామ – జన్మించె మహలక్ష్మి చందమామ
అంతలో మునులునూ చందమామ – అక్కడికి వచ్చిరీ చందమామ
కపిల గాలవులునూ చందమామ – కశ్యపాంగిరసులు చందమామ
అత్రి వశిష్టులూ చందమామ – ఆకన్నియను జూచి చందమామ
బ్రతుకుగనె యీతల్లి చందమామ – బ్రతుకమ్మ యనిరంత చందమామ
పిలుతు రదివరనుండి చందమామ – ప్రియముగా తలిదండ్రి చందమామ
బ్రతుకమ్మ యని పేరు చందమామ – ప్రజలంత అందరూ చందమామ
తాను ధన్యూడంచు చందమామ – తనబిడ్డతో రాజు చందమామ
నిజపట్టణము కేగి చందమామ – నేల పాలించంగ చందమామ
శ్రీమహా విష్ణుండు చందమామ – చక్రాంకుడను పేర చందమామ
రాజు వేషంబున చందమామ – రాజు ఇంటికి వచ్చి చందమామ
ఇల్లింట మనివుండి చందమామ – అతివ బ్రతుకమ్మను చందమామ
పెండ్లాడి కొడుకులా చందమామ – పెక్కుమందిని గాంచె చందమామ
ఆరువేల మంది చందమామ – అతి సుందరాంగులు చందమామ
ధర్మాంగుడను రాజు చందమామ – తన భార్య సత్యవతి చందమామ
సరిలేని సిరులతో చందమామ – సంతోషమొందిరీ చందమామ
జగతిపై బ్రతుకమ్మ చందమామ – శాశ్వతంబుగ వెలసె చందమామ
No comments:
Post a Comment
Post your valuable comments