Tuesday, December 31, 2019

సౌమనస్యమే శుభాకాంక్ష 🙏🌍



పరిణామ లక్షణం కలిగింది కాలం. ఈ పరిణామాలన్నీ మేలు కలిగించాలని ఆశించి, శుభసంకల్పాలతో కాలాన్ని స్వాగతించడమే మనం చేయవలసింది.
ఏమార్పూ లేని స్థిరత్వం నిష్ప్రయోజనమే. మార్పు జరిగిన ప్రతిసారీ మేలూ కీడూ కలిసే పలకరిస్తాయి. మేలును స్వీకరిస్తూ కీడును సానుకూలంగా మలచుకోగలిగే తెలివికే ’సమర్థత’ అని పేరు. ఈసమర్థత కలిగిన వారికి కాలంలో ప్రతి మలుపూ గెలుపే.
మంచి ఫలితాన్ని సాధించడానికి మొదటి మెట్టు - మంచి సంకల్పం. నలుగురి మంచినీ కోరుకునే శుభసంకల్పమే శుభఫలాలను సాధిస్తుంది. ఈ సంకల్పాలతో కూడిన ఆకాంక్షలతో కాలానికి ఆహ్వానం పలకడం సత్సంప్రదాయం.
సమూహ సౌఖ్యాన్ని కాంక్షించే వ్యక్తిత్వంలో ముఖ్యమైనది ’సౌమనస్యభావన’. ఒకరిపట్ల ఒకరికి స్నేహం, ఒకే హృదయం కలిగి ఉండటం ’సౌమనస్యం’. పరస్పర సానుకూలత ప్రస్తుత కాలంలో అన్నిచోట్లా కరువవుతున్న ముఖ్య లక్షణమిదే,
ఒకరంటే ఒకరికి పడకపోవడమనే ప్రతికూలత - సంఘర్షణకీ, సంక్షోభాలకీ, విధ్వంసాలకీ మూలకారణ. మనిషి మనిషితో కలిసి బతకలేకపోవడం దౌర్భాగ్యం. జంతువుల్లో కూడా కనిపించని దుర్లక్షణం.
అందరూ ఒకే అభిప్రాయం కలిగి ఉండటం సాధ్యం కాదు. కారణం - మనిషికున్న ప్రత్యేకమైన ఆలోచనా శక్తి. అందరి ఆలోచనలూ ఒకేలా ఉండవు. కొందరి ఆలోచనలు మరికొందరితో విభేదించడం చేత వివాదాలు, గుంపులు ఏర్పడతాయి. ఇది మానవ సమాజంలో సహజం.
స్నేహశీలత అలవరచుకొని, సమిష్టి హితమే ఉమ్మడి లక్ష్యంగా ఉన్నప్పుడు విభిన్న భావాలనూ సమన్వయించవచ్చు. అందులో కొన్ని సర్దుబాట్లు, కొన్ని లాభాలు తప్పకుండా ఉంటాయి. ఈ సౌమనస్య లక్షణం లేనప్పుడు తమ వైమనస్య ధోరణినే సమాజమంతా వ్యాప్తి చేయించి విధ్వంసాలను సృష్టించడం జరుగుతుంది.
సృష్టిలో విభిన్నత అత్యంత సహజం. సిద్ధాంతమో, మతమో, కులమో, ప్రాంతమో, భాషో....ఏదో ఒకటి చాలు విభిన్నత్వానికి. ఇవేమీలేని మానవ సమాజం ఏదేశంలోనూ ఉండదు. నాగరికత కలిగిన మానవ జగతిలో ఇవన్నీ ఉంటాయి. ఆ ఉండడాన్ని అంగీకరించాలి. విభిన్నతలన్నింటి మధ్య సౌమనస్యమనే సూత్రాన్ని మాత్రం దృఢంగా కాపాడుకుంటే సమాజహితం తప్పక సాధించవచ్చు.
మన దృష్టిలో స్నేహ శీలత ఉన్నప్పుడు - ఎదుటివారిని క్షమించగలం, కలుపుకోగలం. కులాలు వేరైనప్పుడు మతంలో కలవవచ్చు. మతం వేరైనప్పుడు ’మనిషితనం’తో కలవవచ్చు. ప్రాంత, భాషాది భేదాలెదురైనప్పుడు ’ఏకదేశం’ అనే భావనతో ఏకం కావచ్చు. ఆ ఉమ్మడి ప్రయోజనం కోసం సమన్వయంతో మనుగడ సాగించవచ్చు. సౌమనస్య భావన వలన ప్రయోజనమిదే.
మన పరిసరాల్లో సంబంధాల్లో సౌమనస్యం నెలకొనాలని వేదం పలు శుభాకాంక్షలు పలికింది.
’మైత్రీభావంతో కూడిన దృష్టితో ప్రాణులన్నింటినీ చూచెదముగాక!’(యజుర్వేదం). ఇది మొత్తం ప్రకృతిలో మానవుని సామరస్యాన్ని ప్రబోధించే శుభకామన.
’మనందరం సమాన హృదయంతో, స్నేహంతో విద్వేషరహితులమై ఉందాం’!(అధర్వవేదం).
’ఈజగతిలో అందరూ ఏ రుగ్మతలూ లేకుండా ఉండాలి, ఒకరిపట్ల ఒకరు సుమనస్కులై (స్నేహశీలురై) ఉండాలి....అలా ఉండే విధంగా శుభకరమైన వచనాలు పలుకుదాం...’ అని యజుర్వేద మంత్రం.
మనం పలికే మాటలు హితాన్ని కాంక్షించేవైనప్పుడు, ఇంకొకరిని రెచ్చగొట్టేవి కానప్పుడు - శాంతి తప్పకుండా లభిస్తుందని వేదమాత ప్రబోధం.
మాటలో శుభం, మనసులో స్నేహం, ఆచరణలో హితం...ఈ మూడూ కలిగిన వాడే ’మనిషి’ అనిపించుకుంటాడు. ఈమనిషితనాన్ని బతికించే విధంగా ధర్మవేత్తలు, గుంపుల్ని నడిపే నేతలు ప్రవర్తించినప్పుడు ప్రపంచశాంతి సుసాధ్యం.
అలాంటి సౌమనస్య భావన విశ్వంలో వ్యాపించాలని - ఈకాలం మలుపులలో నిలబడి వైదిక సూక్తులతో శుభాలను కాంక్షిద్దాం.

* చాలా రోజుక క్రితం నచ్చి దాచుకున్నాను , బాగుందని సేకరించినది పంచుకుంటున్నాను *
దివ్య చేవూరి 
12/31/2019

No comments:

Post a Comment

Post your valuable comments